

ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులతో పాటు రైల్వే కౌంటర్లలో టికెట్లు తీసుకునే వారికి కూడా అదనపు బీమా కవరేజీని తప్పనిసరిగా వర్తింపజేయాలని సుప్రీంకోర్టు రైల్వే శాఖను ఆదేశించింది. ఈ నెల 27 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఆదేశాలను పాటించకపోతే రైల్వే బోర్డు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రైల్వే భద్రత, ప్రయాణాల్లో అవాంఛనీయ ఘటనల నివారణకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. గతంలో పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా రైల్వే శాఖ చర్యలు తీసుకోలేదని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది శికిల్ సూరీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఆన్లైన్, ఆఫ్లైన్లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికుల మధ్య బీమా విషయంలో వివక్ష ఎందుకు చూపుతున్నారని అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్జిత్ బెనర్జీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరోవైపు, రైల్వే ట్రాక్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంలో నిర్దేశించిన లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోతున్నారో వివరించాలని రైల్వే బోర్డును ఆదేశించింది. ఏటా నిర్ణయించిన లక్ష్యంలో మూడో వంతు మేర వెనుకబడటానికి కారణాలేమిటో తెలియజేయాలని పేర్కొంది. ప్రయాణికుల భద్రతపై గతంలో ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!