

పాతకాలపు వైభవం, సంస్కృతి సంప్రదాయాలు క్రమంగా కనుమరుగవుతున్న ఈ రోజుల్లో శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం ఆవలంగి గ్రామంలోని జేబీటీ విద్యాసంస్థ ఓ మంచి ప్రయత్నం చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా చిన్నారులకు పాతకాలపు దసరా సంప్రదాయాలను పరిచయం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నేటి తరానికి ఒకప్పుడు గ్రామాల్లో దసరా వేడుకలు ఎలా జరిగేవో తెలియజేయడంతో పాటు, మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
పూర్వం దసరా శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున పాఠశాలల్లో సరస్వతీ పూజ నిర్వహించేవారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలోని ఇళ్లకు వెళ్లి ఆకులు, పువ్వులతో అలంకరించిన బాణాలను పట్టుకుని సంప్రదాయ పాటలు పాడేవారు. గ్రామస్థులు పిల్లలకు అటుకులు, బెల్లం, పెసరపప్పు వంటి పదార్థాలను ఇచ్చేవారు. ఉపాధ్యాయులకు తమ ఇళ్లలో పండిన కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం అందించేవారు. కాలక్రమేణా ఈ సంప్రదాయం కనుమరుగైంది. అయితే జేబీటీ విద్యాసంస్థ నిర్వాహకులు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో చిన్నారులు, ఉపాధ్యాయులు కలిసి బాణాలను తయారు చేసి గ్రామంలోని ఇళ్లకు వెళ్తూ పాత పాటలను ఆలపిస్తున్నారు. ప్రజలు ఇచ్చే మిఠాయిలు, చిన్న బహుమతులను స్వీకరిస్తూ ఆనందంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇతర పాఠశాలలు కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలని, వారిని టీవీలు, సెల్ఫోన్లకు కొంత దూరంగా ఉంచాలనేదే తమ ప్రయత్నమని మోహన్ గాంధీ తెలిపారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!