

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భారీగా ఓట్ల తొలగింపు జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక చర్య చేపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్కు 2026 అక్టోబర్ 15న నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్మాల్య బాగ్చీ నేతృత్వంలోని ధర్మాసనం, ఇండియా కూటమి నేతలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను విచారించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అసదుద్దీన్ ఒవైసీ, దిగ్విజయ్ సింగ్ తదితరులు ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ఓట్ల తొలగింపులో ప్రధాన ఎన్నికల కమిషనర్ పాత్రపై విచారణ జరపాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిలిపివేయాలని, పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని, తొలగించిన ఓట్లకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వారీ వివరాలను వెల్లడించేలా ఆదేశించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు.
ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 46 పిటిషన్లలోని పత్రాలను ధర్మాసనం పరిశీలించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా.. న్యాయస్థానంలో విచారణలో ఉన్న అంశంపై ప్రతిపక్ష నేతలు నిర్వహించిన నిరసనలు, ర్యాలీలను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి, న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని, న్యాయస్థానాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలను పట్టించుకోబోమని స్పష్టం చేశారు. అక్టోబర్ 12న సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన నిరసనకు సంబంధించిన పూర్తి నిఘా కెమెరాల దృశ్యాలను భద్రపరచాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల సంఘం నిర్ణయాలపై దాఖలైన పిటిషన్లకు నోటీసులు జారీ చేయడం రాజకీయ నేతల నిరసనలను సమర్థించినట్లు లేదా వారి ప్రవర్తనను క్షమించినట్లు కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!