

న్యూఢిల్లీ: కొత్త ఏడాది నుంచి టీవీల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెమరీ చిప్‌ల కొరతతో పాటు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే చిప్‌ల కొరత కారణంగా వాటి ధరలు పెరగగా, రూపాయి బలహీనత టీవీ తయారీ ఖర్చులను మరింత పెంచుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో 2026 జనవరి నుంచి టీవీల ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవల డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ తొలిసారిగా 90 మార్క్‌ను దాటింది. టీవీ తయారీలో అవసరమైన ఓపెన్ సెల్లు, సెమీకండక్టర్ చిప్‌లు, మదర్‌బోర్డులు వంటి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉండటంతో దిగుమతి వ్యయాలు పెరుగుతున్నాయి. అలాగే ఏఐ సర్వర్లకు అవసరమైన హై బ్యాండ్‌విడ్త్ మెమరీ చిప్‌లకు భారీ డిమాండ్ ఉండటంతో అన్ని రకాల మెమరీ చిప్‌ల ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఎల్ఈడీ టీవీల ధరలు సుమారు 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా అధ్యక్షుడు ఎన్ఎస్ సతీష్ తెలిపారు.
ఇప్పటికే కొన్ని టీవీ తయారీ సంస్థలు ధరలు పెరిగే అవకాశం ఉందని డీలర్లకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. గత మూడు సంవత్సరాల్లో మెమరీ చిప్‌ల ధరలు సుమారు 500 శాతం వరకు పెరిగాయని థామ్సన్, కోడక్ బ్రాండ్లకు లైసెన్సుతో టీవీలు తయారు చేస్తున్న సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ పరిస్థితుల వల్ల టీవీల ధరలు 7 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. రాబోయే రెండు త్రైమాసికాల్లోనూ చిప్‌ల ధరలు పెరుగుతూనే ఉండవచ్చని, అలా జరిగితే ధరలు మరింత పెంచాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సొంత బ్రాండ్ దైవాతో పాటు అనేక టీవీలకు ఓడీఎంగా పనిచేస్తున్న వీడియోటెక్స్ కూడా మెమరీ చిప్‌ల లభ్యత పెద్ద సవాలుగా మారనుందని పేర్కొంది.
సోర్సింగ్ స్థాయిలో ఫ్లాష్ మెమరీ, డీడీఆర్4 చిప్‌ల ధరలు వెయ్యి శాతం వరకు పెరిగాయని, వీటిని ప్రధానంగా ఏఐ డేటా సెంటర్లకు సరఫరా చేయడమే ఇందుకు కారణమని వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపారు. వచ్చే ఏడాది రెండో త్రైమాసికం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని, ఆ తర్వాత చిప్ తయారీ పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ క్షీణత వల్ల దిగుమతి ఖర్చులు మరింత పెరిగి పరిస్థితి సంక్లిష్టంగా మారిందన్నారు. ప్రస్తుతం ఉన్న పాత స్టాక్ పూర్తయ్యాక రాబోయే వారాల్లో ఈ ప్రభావం వినియోగదారులపై స్పష్టంగా కనిపించనుందని బజాజ్ తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!