

అవసరాలకు ఖర్చు చేయడం సాధారణమే. అయితే, జెన్‌జీ తరం ఈ సంప్రదాయాన్ని మించి, పూర్తిగా కొత్త విధానాన్ని అనుసరిస్తోంది. ఫిన్‌టెక్ యాప్ Super.money నిర్వహించిన తాజా అధ్యయనం, భారత్‌లో జెన్‌జీ యువత రోజువారీ ఖర్చులను ఎలా తెలివిగా నిర్వహిస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా చూపించింది.
యూపీఐ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, చిన్న మొత్తాల కొనుగోళ్లు, క్రెడిట్ వినియోగం వంటి అంశాలను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు. ఇందులో 28 ఏళ్లలోపు యువతే డిజిటల్ చెల్లింపుల వినియోగంలో 72 శాతం వాటా కలిగి ఉండటం గమనార్హం. ఖర్చుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారని భావించే జెన్‌జీ, వాస్తవానికి చాలా క్రమశిక్షణతో, లక్ష్యబద్ధంగా డబ్బును వినియోగిస్తున్నారని నివేదిక చెబుతోంది.
జెన్‌జీకి డిజిటల్ చెల్లింపులు జీవనశైలిలో భాగంగా మారాయి. 74 శాతం మంది నెలకు 50 కంటే ఎక్కువ డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. కొందరు అయితే నెలకు 200 లావాదేవీలను కూడా దాటుతున్నారు. వీటిలో ఎక్కువగా క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులే ఉండటం విశేషం. క్యాబ్ బుకింగ్ నుంచి బిల్లుల చెల్లింపుల వరకు అన్నింటికీ డిజిటల్ పేమెంట్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.
యూపీఐ వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ, జెన్‌జీ చేసే ఖర్చులు ఎక్కువగా చిన్న మొత్తాలకే పరిమితం. 76 శాతం చెల్లింపులు రూ.2,000 లోపే ఉంటున్నాయి. ఇందులో కిరాణా సరుకులకు 26.16 శాతం, ఆహార ఖర్చులకు 23.71 శాతం వెచ్చిస్తున్నారు. ఇదే సమయంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి కోర్సులు, సబ్స్క్రిప్షన్లపై ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదని నివేదిక పేర్కొంది.
జెన్‌జీ ఖర్చుల విధానం సమయానికి అనుగుణంగా మారుతోంది. ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య కిరాణా సరుకుల కోసం ఎక్కువ చెల్లింపులు చేస్తుండగా, సాయంత్రం 6 నుంచి 11 గంటల మధ్య ఆహారానికి సంబంధించిన లావాదేవీలు అధికంగా ఉన్నాయి. కొందరు అర్ధరాత్రి వేళల్లో కూడా ఫుడ్ కోసం డిజిటల్ చెల్లింపులు చేస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది.
దేశంలోని మెట్రో నగరాల్లో ఉదయం వేళల్లో కిరాణా కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. లావాదేవీల విలువ పరంగా మెట్రోలు ముందుండగా, చిన్న పట్టణాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. టైర్-2 నుంచి టైర్-4 పట్టణాల్లో 41 శాతం మంది యూజర్లు యూపీఐ చెల్లింపులపై ఆధారపడుతున్నారు.
భారతదేశంలో వీకెండ్ స్పెండింగ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య అత్యధిక లావాదేవీలు జరుగుతున్నాయి.
ఇక క్రెడిట్ వినియోగంలోనూ జెన్‌జీ ఆలోచనాత్మక మార్పు కనిపిస్తోంది. దాదాపు 45 శాతం మంది క్రెడిట్‌కు కొత్తవారైనా, ఎఫ్డీ ఆధారిత సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇది జెన్‌జీ తరం ఆర్థికంగా అవగాహనతో, జాగ్రత్తగా ముందుకు సాగుతున్నదానికి నిదర్శనం.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!