

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు చెందిన 3,897 మంది ఖాతాదారుల వివరాలు సైబర్ దాడి కారణంగా బహిర్గతమైనట్లు బ్యాంకు వెల్లడించింది. ఈ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లోకి చేరినట్లు తెలిపింది. ఇందులో ఖాతాదారుల పేర్లు, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలు, ఈమెయిల్ ఐడీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై తమకు థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్‌తో పాటు డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) నుంచి హెచ్చరిక అందినట్లు ఎస్బీఐ తెలిపింది.
ఈ ఘటన వల్ల బ్యాంకు ఆర్థిక లావాదేవీలపై గణనీయమైన ప్రభావం ఉండబోదని ఎస్బీఐ స్పష్టం చేసింది. కొందరు ఖాతాదారుల వివరాలు బహిర్గతమైనప్పటికీ, బ్యాంకు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని వెల్లడించింది. డేటా భద్రతకు జరిగిన నష్టం, ఖాతాదారులు మరియు బ్యాంకుపై పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, అది పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని బ్యాంకు వెల్లడించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!