

కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ పన్నుల్లో కీలక మార్పులు చేసింది. అక్టోబర్ 16 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేట్ల ప్రకారం, డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం, రహదారులు–మౌలిక సదుపాయాల సెస్‌లను కలిపి లీటరుకు రూ.16గా ఉన్న పన్నును రూ.8.50కి తగ్గించింది. దీంతో డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ.7.50 మేర పన్ను తగ్గినట్లయింది. మరోవైపు, పెట్రోల్ ఎగుమతులపై లెవీని లీటరుకు రూ.0.50 నుంచి రూ.2.50కి పెంచింది. ఈ కొత్త రేట్లు తదుపరి 15 రోజుల పాటు అమల్లో ఉంటాయి. విమాన ఇంధనం అయిన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై లీటరుకు రూ.10.50 పన్ను మాత్రం యథాతథంగా కొనసాగుతుంది.
అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో మార్పులు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఇంధన లభ్యతను కాపాడటం, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరిగినప్పుడు ఎగుమతిదారులకు లభించే అసాధారణ లాభాలను నియంత్రించడం విండ్‌ఫాల్ పన్నుల ప్రధాన ఉద్దేశం. కేంద్రం మార్చి 27 నుంచి డీజిల్, ATF ఎగుమతులపై ఈ పన్నులను అమలు చేస్తుండగా, మే 16 నుంచి పెట్రోల్ ఎగుమతులపైనా విధిస్తోంది. ప్రతి 15 రోజులకు ఒకసారి రేట్లను సమీక్షించే విధానంలో భాగంగా తాజా సవరణలు చేసింది. దేశీయ వినియోగదారులకు విక్రయించే పెట్రోల్, డీజిల్‌పై పన్నుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!