

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) ‘ఎయిర్టెల్ మనీ’కి రాబోయే కొన్నేళ్లలో రూ.20,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నట్లు ప్రకటించింది. దేశంలో రుణాల అందుబాటులో ఉన్న లోటును తగ్గించాలనే లక్ష్యంతో ఈ పెట్టుబడిని అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇటీవల ఈనెల 13న ఎయిర్టెల్ మనీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఎన్బీఎఫ్సీ లైసెన్సు లభించింది. మొత్తం రూ.20,000 కోట్లలో 70 శాతం నిధులను ఎయిర్టెల్ సమకూర్చగా, మిగిలిన 30 శాతాన్ని ప్రమోటర్ గ్రూప్ అయిన భారతీ ఎంటర్ప్రైజెస్ అందించనుంది.
దేశవ్యాప్తంగా సురక్షితమైన, సాంకేతిక ఆధారిత డిజిటల్ ఆర్థిక సేవలను విస్తరించడమే లక్ష్యంగా ఎయిర్టెల్ మనీ ముందుకెళ్తోంది. 500 మందికి పైగా డేటా సైంటిస్టుల నైపుణ్యం, బలమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల సహాయంతో వినూత్న సేవలను అందించేందుకు సంస్థ కట్టుబడి ఉంది. గత రెండేళ్లలో లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా రూ.9,000 కోట్లకు పైగా రుణాలను పంపిణీ చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా భారతీ ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గోపాల్ విఠల్ మాట్లాడుతూ, సాంకేతికత, డేటా విశ్లేషణ, వినియోగదారుల విశ్వాసాన్ని సమన్వయం చేస్తూ జాతీయ స్థాయిలో విశ్వసనీయమైన డిజిటల్ క్రెడిట్ వ్యవస్థను నిర్మించినట్లు తెలిపారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!