

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం, అలాగే ఏఐ సర్వర్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు అత్యంత కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల (పీసీబీ) కొరత ఏర్పడింది. ఈ పరిస్థితి టెలికం, మొబైల్, ఆటోమోటివ్, స్మార్ట్ మీటర్లు, పవర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రభావం చూపుతోంది. ముడి పదార్థాల ధరలు భారీగా పెరగడం, ప్రధాన షిప్పింగ్ మార్గాల్లో అంతరాయాలు, ఏఐ పరిశ్రమకు విడిభాగాల ప్రాధాన్యత పెరగడం వల్ల పీసీబీల సరఫరా ఒత్తిడికి గురైంది.
ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ఈసీఎంఎస్) కింద దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్న సమయంలో ఈ కొరత పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తోంది. సౌదీ అరేబియాలోని స్పెషాలిటీ కెమికల్ ప్లాంటుపై దాడి కారణంగా కీలక రసాయనాల సరఫరా దెబ్బతిన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోవైపు కాపర్ క్లాడ్ ల్యామినేట్లు, ఫొటోరెసిస్ట్స్ వంటి కీలక పదార్థాల కోసం ఇంకా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నాయి. దేశీయ తయారీ సామర్థ్యాన్ని వేగంగా పెంచాల్సిన అవసరం ఉందని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!