

సోనీ గ్రూప్ కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా తయారైన పాటల్లో ఉపయోగించిన అసలు సంగీతాన్ని గుర్తించే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు సమాచారం. ఈ టెక్నాలజీ ఏఐ రూపొందించిన పాటల్లో కాపీరైట్ ఉన్న సంగీతాన్ని గుర్తించి, తమ పాటలు అనుమతి లేకుండా వాడారా లేదా అనే విషయం హక్కుదారులు తెలుసుకునేలా సహాయపడుతుంది. నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం, ఈ వ్యవస్థ ఏఐ పాటకు ఆధారమైన అసలు పాటలను గుర్తించడమే కాకుండా, ఒక పాటలో ఒకటి కంటే ఎక్కువ సంగీత మూలాలు ఉన్నా వాటిని గుర్తించి, ఎంత శాతం ఉపయోగించబడిందో కూడా అంచనా వేయగలదు.
ఈ టెక్నాలజీ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఏఐ డెవలపర్లు సహకరిస్తే వారి ట్రైనింగ్ డేటాను నేరుగా పరిశీలించి ఏ పాటలు ఉపయోగించారో గుర్తిస్తుంది. వారు సహకరించకపోతే, ఇప్పటికే ఉన్న సంగీత డేటాబేస్లతో పోల్చి మూలాలను గుర్తిస్తుంది. ఈ టెక్నాలజీ అభివృద్ధిలో సోనీ ఏఐ ముఖ్య పాత్ర పోషించింది. ఏఐ ద్వారా తయారైన సంగీతం వల్ల వచ్చే ఆదాయాన్ని అసలు సంగీత సృష్టికర్తలకు న్యాయంగా అందించడం, కాపీరైట్ సమస్యలను తగ్గించడం ఈ టెక్నాలజీ ప్రధాన లక్ష్యంగా సంస్థ భావిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!