

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తొలి అర్ధభాగంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓడిపోయి వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. ముందుగా పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా, ఢిల్లీ జట్టు 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కీలక మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినప్పటికీ ఓటమిపాలవడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ వ్యూహాల వైఫల్యాన్ని అంగీకరించాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఈ పిచ్‌పై 210 పరుగులు చాలానేనని, బంతి సీమ్ అవుతుండటంతో పాటు అసమాన బౌన్స్ కనిపించిందని తెలిపాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు ఓవర్ ఇవ్వకపోవడంపై స్పందిస్తూ.. పిచ్ సీమర్లకు అనుకూలిస్తోందనే కారణంతో పేసర్లపై నమ్మకం ఉంచామని చెప్పాడు. అయితే డెత్ ఓవర్లలో హార్డ్ లెంగ్త్ బౌలింగ్ వ్యూహం పూర్తిగా విఫలమైందని అంగీకరించాడు. తమ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఓటమికి కారణమని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!