

వచ్చే వన్డే ప్రపంచకప్‌లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జట్టులో ఆటగాళ్ల ఎంపికకు వయసు కంటే ఫిట్‌నెస్, ప్రదర్శనే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండి, అద్భుతంగా ఆడుతూ జట్టుకు విజయాలు అందించే ఆటగాళ్లను పక్కన పెట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్నారు.
భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు నాయకత్వంలో అనుభవం ఉందని మిథున్ మన్హాస్ పేర్కొన్నారు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించిన గిల్‌కు, జాతీయ జట్టును నడిపించే సామర్థ్యం ఉందని తెలిపారు. ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ల అనుభవం గిల్‌కు ఉపయోగపడుతుందని చెప్పారు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో నాయకత్వం వహించగలడని, ఇతర ఆటగాళ్లు కూడా తమ విభాగాల్లో బాధ్యతలు తీసుకుంటారని వివరించారు. సీనియర్ల సహకారంతో గిల్ జట్టును సమర్థంగా నడిపించగలడని మిథున్ విశ్వాసం వ్యక్తం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!