

బీఆర్ఎస్ హయాంలో పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పనులకు సంబంధించి.. ప్రభుత్వం 1500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కక్ష సాధిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. అప్పులు తెచ్చి పనులు చేసిన వారు నేడు మిత్తీలు కట్టలేక రోడ్డున పడ్డారని, అప్పుల బాధతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న కాంట్రాక్టర్లకు పైసల్లేవంటున్న ప్రభుత్వం.. పెయింటింగ్, బెంచీలు సరఫరా చేసిన బడా కంపెనీలకు మాత్రం రాత్రికి రాత్రే వందల కోట్లు ఎలా విడుదల చేసింది? అని ప్రశ్నించారు.
కమీషన్లు ఇవ్వరనే ఈ చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను గాలికి వదిలేశారా అని సీఎం రేవంత్ ను నిలదీశారు. ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్ల ఉసురు తీస్తున్నదని మండింపడ్డారు. పలువురు మన ఊరు మన బడి సివిల్ కాంట్రాక్టర్లు సోమవారం హరీశ్ రావును కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు బిల్లులు చెల్లించడం లేదని, న్యాయంగా అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని వారు వాపోయారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్నా, విద్యాశాఖ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
“సీఎం అపాయింట్మెంట్ ఇవ్వరు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వేడుకున్నా స్పందన లేదు. చివరికి, సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపితే.. వారిపై అక్రమ కేసులు బనాయించడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంపై శాసనమండలి చైర్మన్ మండలి సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు. మన ఊరు మన బడి బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయని, తమ సొంత ఊరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. బిల్లులు విడుదల చేయాలని తాను స్వయంగా ముఖ్యమంత్రిని కోరినా.. బిల్లులు విడుదల చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం” అని ఆయన విమర్శించారు. కనీసం ఇప్పుడైనా మన ఊరు - మన బడి కోసం ఆర్థిక శాఖ నుంచి విద్యాశాఖకు వచ్చిన నిధులనైనా.. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సివిల్ కాంట్రాక్టర్లకు చెల్లిస్తారా? లేక ఆ డబ్బును కూడా కూడా బడా కాంట్రాక్టర్లకే కట్టబెడతారా? అని నిలదీశారు. వారిపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి వెంటనే బిల్లులను చెల్లించాలన్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!