
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు భారతీయులకు నిరంతరం అడ్వైజరీలు జారీ చేస్తున్నాయని చెప్పారు. భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తోందని, గల్ఫ్ దేశాల ప్రభుత్వాలతో భారత్ చర్చలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. భారత విమానయాన సంస్థలు అవసరమైన వారిని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. దోహా, జోర్డాన్ వంటి ప్రాంతాల్లో ఉన్న భారతీయులకు కూడా సహాయం అందిస్తున్నామని, ఇరాన్‌లో పరిస్థితులపై అక్కడి విదేశాంగ మంత్రితో మాట్లాడినట్లు జై శంకర్ చెప్పారు.
క్రూడ్ ఆయిల్ పరిస్థితులపై జరుగుతున్న ప్రచారానికి కూడా ఆయన స్పందించారు. చమురు కోసం దేశం లేదా ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టబోమని స్పష్టం చేశారు. భారతీయుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, దేశ ప్రయోజనాలు ఎల్లప్పుడూ సర్వోన్నతంగా ఉంటాయని అన్నారు. దేశంలోని చమురు నిల్వలపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నం, మంగళూరు, పడూర్ వంటి వ్యూహాత్మక కేంద్రాలతో పాటు పైప్‌లైన్లు, ట్యాంకులు, సముద్ర నౌకల్లో దాదాపు 4 వేల కోట్ల లీటర్ల చమురు నిల్వలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!