

స్టార్డమ్ ఎంత ఉన్నా రజనీకాంత్ ఎంతో నిరాడంబరంగా ఉంటారని బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రశంసించారు. ఆయనలో ఎలాంటి ఆర్భాటం ఉండదని, సామాన్యుడిలా అందరితో కలిసిపోతారని తెలిపారు. ప్రేక్షకులు రజనీకాంత్ను అమితంగా ప్రేమించడానికి ఆయన వ్యక్తిత్వమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్ 2’లో విద్యాబాలన్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం రజనీకాంత్తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, ప్రశంసలతో ప్రోత్సహిస్తారని, ఆయనతో పనిచేసేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాలేదని చెప్పారు.
ఇదే ఇంటర్వ్యూలో ‘జైలర్ 2’ చిత్రీకరణ సమయంలో ఎదురైన ఓ ఆసక్తికర అనుభవాన్ని కూడా విద్యాబాలన్ పంచుకున్నారు. రజనీకాంత్ ముఖంపై సిగరెట్ పొగ వదిలే సన్నివేశం కోసం షూటింగ్కు ఒక్కరోజు ముందు తనకు కొత్తగా సుమారు ఒకటిన్నర పేజీల డైలాగులు ఇచ్చారని తెలిపారు. డైలాగులు చెబుతూనే సిగరెట్ కాల్చాల్సి రావడంతో ఆ సన్నివేశాన్ని ఎలా పూర్తి చేయాలా అని భయపడ్డానని చెప్పారు. షూటింగ్ సమయంలో తన చేతులు వణకడాన్ని దర్శకుడు నెల్సన్ గమనించారని వెల్లడించారు. రజనీకాంత్ వంటి దిగ్గజ నటుడితో కలిసి పనిచేయడం తనకు ప్రత్యేకమైన అనుభవమని విద్యాబాలన్ పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!