

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘ఎన్‌బీకే111’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో బాలకృష్ణ గాయపడటంతో షూటింగ్‌కు స్వల్ప విరామం ఇచ్చారు.
ఇదిలా ఉండగా, అభిమానులకు మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ‘ఎన్‌బీకే111’ చిత్ర టైటిల్‌ను సెప్టెంబర్ 6న అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. “ఆ సింహాన్ని బయటకు వదిలింది ఎవరు?” అనే మాస్ క్యాప్షన్‌తో విడుదల చేసిన వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాకు ‘గాడ్’, ‘దాదా’ అనే టైటిళ్లు ప్రచారంలో ఉండగా.. ‘దాదా’ పేరును ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!