

దర్శకుడు ప్రేమ్ రూపొందిస్తున్న ‘కేడీ: ది డెవిల్’ చిత్రంలోని ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్‌లకు జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ఈ నెల 6న జరిగిన విచారణకు నోరా ఫతేహి వ్యక్తిగతంగా హాజరు కాకుండా ఆమె న్యాయవాది హాజరుకావడంపై కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె స్వయంగా హాజరుకావాలని స్పష్టం చేస్తూ ఈ నెల 27 వరకు గడువు ఇచ్చింది. అలాగే సంజయ్ దత్ ఈ నెల 8న తప్పనిసరిగా హాజరుకావాలని కోరింది. ఇదే వివాదంపై రచయిత రకీబ్ ఆలం, దర్శకుడు ప్రేమ్, నిర్మాతలు ఇప్పటికే లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలుపగా, ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
ఈ పాటలోని సాహిత్యం మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉందని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహాత్కర్ వ్యాఖ్యానించారు. పాట అర్థం తెలియదని చెప్పడం సమంజసం కాదని చిత్రబృందాన్ని ఆమె హెచ్చరించారు. ఈ వివాదంపై స్పందించిన దర్శకుడు ప్రేమ్, ఈ పాటను కేవలం వినోదం కోసం రూపొందించామని, ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. ధ్రువ్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో నోరా ఫతేహి, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!