

‘రాజారాణి’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటి నజ్రియా నజీమ్, దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి తిరిగి అడుగుపెడుతున్నారు. 2014లో విడుదలైన ‘తిరుమణం ఎనుమ్ నిక్కా’ తర్వాత ఆమె తమిళ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ‘సీన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సూర్య శక్తిమంతమైన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. మలయాళంలో ‘ఆవేశం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న జితు మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువ నటుడు నస్లెన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నజ్రియా భావోద్వేగానికి గురయ్యారు. తాను చదువుకున్న దుబాయ్‌లో మళ్లీ అడుగుపెట్టడం, అలాగే చాలా ఏళ్ల తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి తిరిగి రావడం తనకు ప్రత్యేకమైన అనుభూతినిచ్చాయని ఆమె తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పాత్రను ఇచ్చిన దర్శకుడు జితు మాధవన్‌కు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు సూర్య, నస్లెన్లకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ‘సీన్’తో తన ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతి అని పేర్కొన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు నవ్వులు పంచుతుందని నజ్రియా ఆశాభావం వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!