

ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మద్దతుగా నిలిచారు. ఉత్తరాఖండ్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దలేర్ మెహందీకి ఎదురైన అనుభవంపై ఆయన స్పందించారు. గాయకుడితో తనకు చాలా ఏళ్లుగా పరిచయం ఉందని, తనకు తెలిసినంతవరకు ఆయన మద్యం సేవించరని అనుపమ్ ఖేర్ తెలిపారు. గత రెండుమూడేళ్లుగా దలేర్ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, నిర్వాహకులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన కార్యక్రమానికి హాజరై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, కార్యక్రమంలో ఉత్తరాఖండ్ మంత్రి సుబోధ్ ఉనియాల్.. దలేర్ మద్యం సేవించి ప్రదర్శన ఇస్తున్నారని వేదికపైనే ఆరోపించడంతో వివాదం చెలరేగింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసి తాను బాధపడ్డానని అనుపమ్ ఖేర్ చెప్పారు. ఒక కళాకారుడిని బహిరంగ వేదికపై అవమానించడం సరికాదని, అభ్యంతరాలుంటే వ్యక్తిగతంగా, గౌరవప్రదంగా తెలియజేయవచ్చని అన్నారు. దలేర్ మెహందీతో తనకు ఉన్న పరిచయం ఆధారంగా ఆయన వ్యక్తిత్వం గురించి సానుకూలంగా మాట్లాడిన అనుపమ్ ఖేర్.. ఈ పరిస్థితి ఎదురైనందుకు విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గాయకుడికి జరిగిన అవమానంపై మంత్రి తరఫున క్షమాపణలు చెప్పారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!