

టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చారిత్రక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘భారత వర్ష’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావస్తుండగా, దసరా నవరాత్రుల శుభసందర్భంగా చిత్రబృందం ‘అమ్మ కదిలి వచ్చే’ అనే ప్రత్యేక భక్తిగీతాన్ని విడుదల చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘వీర జయధీర’ పాట మంచి ఆదరణ పొందింది. తాజాగా విడుదలైన ఈ పాటకు అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. దుర్గామాత దివ్యత్వాన్ని, భక్తుల ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా పాటను రూపొందించారు. ప్రస్తుతం ఈ గీతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
ఈ పాటలో వివిధ ప్రాంతాల ప్రజలు ఆరాధించే శూలాంభ అమ్మవారి దివ్యోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను వైభవంగా చూపించారు. భక్తుల కోలాహలం, డప్పు చప్పుళ్లు, భక్తిపారవశ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. శూలాంభ అమ్మవారి జాతర వైభవంతో పాటు శక్తిపీఠాల విశిష్టతను కూడా ఈ దృశ్యాలు గుర్తుచేస్తున్నాయి. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాసిన సాహిత్యం దుర్గాదేవి తొమ్మిది రూపాలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి విశిష్టతను వివరిస్తుంది. గాయకుడు స్కంద వేలువల్లి, బృందం ఆలాపన పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. గోపీచంద్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. చివరి దశకు చేరుకున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం నుంచి త్వరలో మరిన్ని అప్డేట్లు రానున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!