

రీమేక్ చిత్రాలతో ఎన్నో విజయాలు అందుకున్న అజయ్ దేవగణ్‌కు మరోసారి అదే ఫార్ములా కలిసొచ్చింది. మలయాళంలో విజయవంతమైన ‘దృశ్యం’ ఆధారంగా రూపొందిన హిందీ ఫ్రాంచైజీ మూడో భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘సింగం ఎగైన్’ తొలి రోజు రూ.43.70 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ రూ.62 కోట్లతో ప్రారంభమైనట్లు సమాచారం. దీంతో అజయ్ కెరీర్లోనే అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పోలీసుగా నేరస్థులను పట్టుకునే పాత్రతో కాకుండా, పోలీసులకు చిక్కకుండా కుటుంబాన్ని కాపాడే విజయ్ సల్గావ్కర్ పాత్రతో ఆయనకు ఈ స్థాయి ఆదరణ లభించడం విశేషం. మూడో భాగం కావడంతో విడుదలకు ముందే బుకింగ్స్‌కు మంచి స్పందన కనిపించింది.
తమిళ ‘ఖైదీ’ ఆధారంగా భారీ యాక్షన్ హంగులతో రూపొందించిన ‘భోలా’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ మాత్రం అజయ్ కెరీర్లో సరికొత్త రికార్డులకు వేదికైంది. ఈసారి హిందీ బృందం మలయాళ కథను యథాతథంగా అనుసరించకుండా విజయ్ సల్గావ్కర్కు భిన్నమైన ముగింపు ఇచ్చింది. ఒరిజినల్ చూసిన ప్రేక్షకుల్లోనూ ఉత్కంఠ కొనసాగడానికి ఇదే కారణమని దర్శకుడు అభిషేక్ పాఠక్ వెల్లడించారు. మోహన్‌లాల్ కూడా హిందీ క్లైమాక్స్‌ను ప్రశంసించినట్లు తెలిపారు. పూర్తి ప్రదర్శన ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.650-670 కోట్ల గ్రాస్, భారత్‌లో రూ.400-415 కోట్ల నెట్ వసూళ్లు రావచ్చని అంచనాలున్నాయి. అయితే హిందీలో నాలుగో భాగం ఉండదని అభిషేక్ పాఠక్ స్పష్టం చేశారు. మలయాళంలో మాత్రం కథ కొనసాగవచ్చనే ప్రచారం జరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!