

సాధారణంగా తక్కువ ధరలో, సులభంగా లభించే పండ్లలో జామపండు ఒకటి. అయితే దీనిని సాధారణ పండుగా తీసిపారేయకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, జామపండులో ఉన్న పోషక విలువలు ఖరీదైన బ్లూబెర్రీస్ వంటి పండ్లకు ఏమాత్రం తీసిపోవు. ముఖ్యంగా జామపండును ముక్కలుగా తినడం మాత్రమే కాకుండా రసం రూపంలో తీసుకోవడం వల్ల మరింత మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. జామలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో పాటు, నారింజతో పోలిస్తే విటమిన్ సి శాతం ఎక్కువగా ఉండటం విశేషం. ఇది శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. ప్రతిరోజూ జామ రసం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ సి లభించి, తరచూ అనారోగ్యానికి గురికాకుండా ఉండవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా జామపండు మేలుకలిగించే పండుగా భావించబడుతోంది. తీయ్యగా ఉన్నప్పటికీ, ఇది లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అదనంగా, జామలోని మెగ్నీషియం రక్తపోటును సమతుల్యం చేయడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
జామలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. కొంతమందికి జామకాయను నేరుగా తింటే అసౌకర్యం కలిగే అవకాశముంటుంది, అలాంటి వారు రసం రూపంలో తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా, జామ రసం అంతర్గత ఆరోగ్యానికే కాకుండా చర్మం మరియు జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు చర్మానికి సహజ కాంతిని అందించడమే కాకుండా జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!