

సినిమాలో పాత్ర నిడివి కంటే దాని ప్రభావమే ముఖ్యమని నిరూపించే నటీమణుల్లో శ్రుతిహాసన్ ఒకరు. కథానాయికగా నటించినా, ప్రత్యేక పాటల్లో కనిపించినా తనదైన గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆమె ముందుంటారు. గతంలో పలు చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో నటించిన శ్రుతి, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్లో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘తంగలాన్’ వంటి వైవిధ్యభరిత చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పా. రంజిత్ ప్రస్తుతం ‘వేట్టువన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్ రేష్మియో ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అట్టకత్తి దినేష్ కథానాయకుడిగా, ఆర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అశోక్ సెల్వన్, కళైయరసన్, విఘ్నేష్, ఫాహద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, శోభితా ధూళిపాళ్ల కథానాయికగా కనిపించనున్నారు.
ఉత్తర చెన్నై నేపథ్యంలో గ్యాంగ్స్టర్ల కథాంశంతో తెరకెక్కుతున్న ‘వేట్టువన్’ చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఇటీవల ‘వర్డ్ ఆఫ్ వేట్టువన్’ పేరుతో చిత్రంలోని పాత్రలను పరిచయం చేశారు. ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో శ్రుతిహాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆమె పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు, విజయ్ సేతుపతితో శ్రుతిహాసన్ జంటగా నటించిన ‘ట్రైన్’ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!