

ప్రపంచ పర్యటనకు బయలుదేరిన విలాస నౌక ‘విల్లా వి ఒడిస్సీ’ ఇరాన్ యుద్ధం ప్రభావంతో తన ప్రయాణాన్ని మధ్యలోనే నిలిపివేసింది. హర్మూజ్ జలసంధి మూసివేత సహా యుద్ధ పరిణామాల కారణంగా ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఆ ఖర్చులను భరించడం కష్టంగా మారింది. దీంతో ఈ నౌక కంబోడియాలోని సిహనౌక్‌విల్లే పోర్ట్‌లో నిలిచిపోయింది. ఇంధన వ్యయ భారాన్ని ప్రయాణికులపై మోపడం సరైన పరిష్కారం కాదని యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. నౌకలో సుమారు 200 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారికి తాత్కాలిక వసతి కల్పిస్తున్నామని, రాబోయే 60 రోజుల్లో పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడతామని సంస్థ వెల్లడించింది. అయితే, నౌక తిరిగి ప్రయాణం ప్రారంభిస్తుందనే హామీ ఇవ్వలేమని స్పష్టం చేసింది.
అమెరికాలోని ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తున్న ‘విల్లా వి రెసిడెన్సెస్’ సంస్థకు చెందిన ఈ నౌక రెండేళ్ల క్రితం నార్తర్న్ ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ నుంచి ప్రపంచ పర్యటనను ప్రారంభించింది. సుమారు 640 అడుగుల పొడవున్న ఈ నౌక ద్వారా ఇతర ఓడలు చేరుకోలేని ప్రాంతాలతో సహా 400కు పైగా గమ్యస్థానాలను సందర్శించేలా ప్రయాణ ప్రణాళిక రూపొందించారు. సంస్థ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, ఐదేళ్ల నివాసానికి క్యాబిన్ ధరలు రూ.57 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. శాశ్వత క్యాబిన్ ధర రూ.1.14 కోట్లకు పైగా ఉండగా, నెలకు సుమారు రూ.3.32 లక్షలు చెల్లించి క్యాబిన్‌ను అద్దెకు తీసుకోవచ్చు. భోజనం, వైఫై, హౌస్‌కీపింగ్, వైద్య సేవలు, ఇతర సదుపాయాల కోసం అదనపు నెలవారీ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!