

హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన స్మారక పరేడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన ఆయన, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని, 2027లోగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 112 మంది డీఎస్పీలను నియమించామని, మరో 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టామని వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని గణనీయంగా పెంచామని, హోంగార్డుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని డీజీపీని ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.
పోలీసు శాఖను ఆధునిక సాంకేతికతతో బలోపేతం చేస్తూనే, సిబ్బంది మానవీయ దృక్పథాన్ని కొనసాగించాలని సీఎం సూచించారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణలో ఈగల్ ఫోర్స్ పనితీరును అభినందించారు. కల్తీ ఆహారాన్ని అరికట్టేందుకు టీజీ సేఫ్, మహిళల భద్రత కోసం షీ టీమ్స్, స్టాండ్ విత్ హర్, స్పందన వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని, బాధితులకు న్యాయం అందించడంలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేయాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చిన ఆయన, అమరవీరుల త్యాగాలను గౌరవిస్తూ శాంతియుతమైన, సురక్షితమైన, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!