

తెలంగాణను అంతర్జాతీయ స్థాయి మెడికల్ వెల్‌నెస్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. తెలంగాణ టూరిజం పాలసీ 2025–30లో భాగంగా హైదరాబాద్‌లోని వైద్య సదుపాయాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లో 89 ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు పొందిన ఆసుపత్రులు, 8 జేసీఐ గుర్తింపు పొందిన ఆసుపత్రులు ఉన్నాయని అధికారులు సమావేశంలో వివరించారు. మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వైద్య చికిత్సల కోసం రోగులు హైదరాబాద్‌కు వస్తున్నారని తెలిపారు.
మెడికల్ టూరిజం అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, అంతర్జాతీయ ప్రచారం, వివిధ శాఖల మధ్య సమన్వయంపై స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సంజయ్ జాజు పేర్కొన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఈ రంగంలోని ప్రాజెక్టులను ప్రోత్సహించాలని, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ముందే వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధం చేయాలని ఆదేశించారు. వైద్య సంప్రదింపులు, చికిత్సలు, ఆసుపత్రి సేవలను సులభతరం చేసేందుకు సింగిల్ విండో పోర్టల్ ఏర్పాటు చేయాలని, అవయవ మార్పిడి ప్రక్రియల్లో నిబంధనల అమలు, పారదర్శకతను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పర్యాటక, ఆరోగ్య, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!