

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) భవిష్యత్ వృద్ధిపై భారీ ఆశలు పెట్టుకుంది. 2030 జూలై 1న 75వ వార్షికోత్సవం జరుపుకునే సమయానికి ఎస్‌బీఐ మొత్తం వ్యాపారం ప్రస్తుత స్థాయి నుంచి దాదాపు రెట్టింపై రూ.200 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని బ్యాంకు చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.
అయితే రూ.200 లక్షల కోట్లను ప్రత్యేక లక్ష్యంగా నిర్ణయించుకోలేదని శెట్టి స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాపార వృద్ధి రేటు, దేశ ఆర్థికాభివృద్ధిని ఆధారంగా చేసుకుని ఈ అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం నాటికి ఎస్‌బీఐ మొత్తం వ్యాపారం రూ.110.01 లక్షల కోట్లకు చేరింది.
ఎస్‌బీఐ వ్యాపార వృద్ధి దేశ ఆర్థిక వృద్ధితో నేరుగా ముడిపడి ఉందని శెట్టి పేర్కొన్నారు. భారత్ జీడీపీ ఏటా 7 నుంచి 8 శాతం చొప్పున పెరిగితే, ఎస్‌బీఐ బ్యాలెన్స్ షీట్ సుమారు 11 నుంచి 12 శాతం చొప్పున వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఈ వేగంతో బ్యాంకు బ్యాలెన్స్ షీట్ ప్రతి ఆరేళ్లకు దాదాపు రెట్టింపు అవుతుందని వివరించారు.
ఈ లెక్కన 2030 నాటికి ఎస్‌బీఐ వ్యాపారం రూ.200 లక్షల కోట్లకు చేరడం పెద్ద కష్టమేమీ కాదని శెట్టి అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నిరంతర వృద్ధి కొనసాగితే బ్యాంకింగ్, ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!