

ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడుల్లో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థల స్థావరాలు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సెప్టెంబర్ ప్రారంభంలో కీవ్ సమీపంలోని కోకాకోలా ప్లాంట్ రష్యా డ్రోన్ దాడిలో ధ్వంసమైనట్లు సమాచారం. సెప్టెంబర్ 25న కీవ్ ప్రాంతంలోని మెక్డొనాల్డ్స్ లాజిస్టిక్స్ గిడ్డంగిపై దాడి జరగడంతో సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. గత ఏడాది ఆగస్టులో మైకొలైవ్లోని పెప్సికో ఉత్పత్తి కేంద్రం కూడా దెబ్బతిన్నట్లు సదరు సంస్థ వెల్లడించింది.
అమెరికా కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, వాటిపై జరిగిన దాడులను ట్రంప్ ప్రభుత్వం బహిరంగంగా ఖండించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్లో అమెరికా వ్యాపార సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆండీ హండర్ పేర్కొన్నారు. ఈ దాడులపై చర్చించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో సమావేశం కావాలని కోరినా స్పందన రాలేదని తెలిపారు. మరోవైపు, యుద్ధాన్ని ముగించి శాంతి ఒప్పందం కుదిరేలా అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తోందని వైట్హౌస్ వెల్లడించింది. అయితే, అమెరికా యాజమాన్యానికి చెందినవనే కారణంతోనే ఈ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని మీడియా కథనం పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!