

ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీలను ప్రజలకు అందుబాటులో ఉండేలా పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కామన్ పాస్ ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రోజువారీ కామన్ పాస్ ధర రూ.400 కాగా, ఇందులో మెట్రో వాటా రూ.300, ఆర్టీసీ వాటా రూ.100గా ఉంది. నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500 కాగా, మెట్రోకు రూ.7,000, ఆర్టీసీకి రూ.1,500 కేటాయించారు.
కామన్ పాస్ ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయన్న అభిప్రాయాల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు ఛార్జీలను పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ అంశంపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ప్రయాణికులకు ఆర్థికంగా ప్రయోజనం కలిగేలా ధరలను నిర్ణయిస్తామని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఆర్టీసీ, మెట్రో సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకునేలా ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, అందరికీ అందుబాటులో ఉండే ధరలతో కామన్ పాస్ విధానం అమలయ్యేలా తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!