

ఢిల్లీలోని పితాంపురలో ఈ ఏడాది నిర్వహించనున్న రామ్లీలా వేడుకల్లో 30 అడుగుల ఎత్తైన బొద్దింక దిష్టిబొమ్మను రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలతో పాటు దహనం చేయనున్నారు. శ్రీ కేశవ్ రామ్లీలా కమిటీ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. బొద్దింక దిష్టిబొమ్మ మురికి, అపరిశుభ్రతకు ప్రతీకగా నిలుస్తుందని, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఢిల్లీ కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచడమే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా వేడుకల్లో ఈసారి భారీ బొద్దింక దిష్టిబొమ్మను చేర్చడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
మరోవైపు, ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో బొద్దింక దిష్టిబొమ్మ ఏర్పాటు ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని శ్రీ కేశవ్ రామ్లీలా కమిటీ అధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్ స్పష్టం చేశారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, సీజేపీ నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రకటన వెలువడటంతో దీనిపై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!