

ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు దేశంలోనే అగ్రగామి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే విధానాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దిల్లీలో గురువారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే సంవత్సరాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఏపీలో 15 శాతం ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గత 24 నెలల్లో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన 714 ప్రాజెక్టులను సాధించామని, వీటిలో రూ.16.6 లక్షల కోట్ల విలువైన 473 ప్రాజెక్టులకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశామని వివరించారు. రూ.4.7 లక్షల కోట్ల విలువైన 247 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని, వాటి ద్వారా సుమారు 7.1 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని తెలిపారు.
పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఆన్‌లైన్‌లో రియల్‌టైమ్‌లో జమ చేసే విధానాన్ని నవంబర్ 12న విశాఖపట్నంలో ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, కావేరి నదుల అనుసంధానంతో పలు రాష్ట్రాల్లో నీటి కొరతను తగ్గించవచ్చని పేర్కొన్నారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 110 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చిలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తిరుపతిలో సెమీకండక్టర్ రంగానికి 10 వేల ఎకరాలు కేటాయిస్తున్నామని చెప్పారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ అభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి అవకాశాలను పెంచుతున్నాయని తెలిపారు. విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సులో పారిశ్రామికవేత్తలు పాల్గొని ఏపీలోని అవకాశాలను పరిశీలించాలని ఆయన పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!