

తెలంగాణ చేపడుతున్న పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు లేఖ రాసింది. అక్టోబర్ 1న జరగనున్న కేఆర్ఎంబీ సమావేశం అజెండాలో ఈ అంశాలను చేర్చి చర్చించాలని కోరింది.ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అలాగే కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాలపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జవహర్ నెట్టెంపాడు పథకంలోని రేలంపాడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించడం, గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచే ప్రతిపాదనలను కూడా అడ్డుకోవాలని పేర్కొంది.
పులిచింతల బ్యాక్‌వాటర్‌పై ప్రతిపాదించిన రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం (బుద్ధమాధవరం), జాన్‌పహాడ్, బెట్టెతాండా ఎత్తిపోతల పథకాలతో పాటు నక్కగూడెం, ముక్త్యాల పథకాలపైనా చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీని కోరింది.
ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలుగా పంచేలా ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది.
తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులు, కృష్ణా జలాల వాటాపై రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి రాసిన ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!