

ఎడమచేతి వాటం పేసర్ టీ. నటరాజన్ మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరనున్నాడు. ఐపీఎల్ 2027కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ప్లేయర్ ట్రేడ్‌లో భాగంగా సన్‌రైజర్స్ అతడిని తిరిగి జట్టులోకి తీసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం నటరాజన్‌కు రూ.5 కోట్ల ఫీజు చెల్లించనుంది. 2025 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు 2020 నుంచి 2024 వరకు ఐదు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన నటరాజన్ తన ఎడమచేతి వాటం బౌలింగ్, యార్కర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
2024 ఐపీఎల్ సీజన్లో నటరాజన్ 19 వికెట్లు పడగొట్టి, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు, ఈ ట్రేడ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌కు చెందిన లెగ్‌స్పిన్నర్ జీషన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరనున్నాడు. అతడికి ప్రస్తుతం లభిస్తున్న రూ.40 లక్షల ఫీజునే ఢిల్లీ కొనసాగించనుంది. నటరాజన్ రాకతో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగానికి అనుభవం తోడవుతుండగా, జీషన్ అన్సారీ చేరికతో ఢిల్లీ స్పిన్ బౌలింగ్ విభాగానికి మరో ప్రత్యామ్నాయం లభించనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!