

విడుదల తేదీ: ఫిబ్రవరి 06, 2026
నటీనటులు: అమర్దీప్ చౌదరి, శాయిలీ చౌదరి, జేడీవీ ప్రసాద్, టేస్టీ తేజ, కరన్ విజయ్, మిర్చీ కిరణ్ తదితరులు
దర్శకుడు: ఎం. ఎం. నాయుడు
నిర్మాతలు: కొమ్మలపాటి సాయి సుధాకర్
సంగీత దర్శకుడు: సుభాష్ ఆనంద్
సినిమాటోగ్రాఫర్: హలేష్ ఎస్
ఎడిటర్: నాహిద్ ఎం
కథ:
కృష్ణ (అమర్దీప్ చౌదరి) చిన్నతనం నుంచే పెళ్లి మీద విపరీతమైన ఆసక్తి పెంచుకుంటాడు. తన ఊరిలో కిరాణా షాపు నడుపుతూ సరదాగా జీవితం సాగిస్తూనే పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల సుమతి (శాయిలీ చౌదరి)ని చూసి ప్రేమలో పడతాడు.
ఆమె చుట్టూ తిరుగుతూ ప్రేమలో పడేయడానికి ప్రయత్నించే కృష్ణ, చివరకు తన ప్రేమను ఆమెకు తెలియజేస్తాడు. శుక్రవారం గుడికి రమ్మని ఆమె చెప్పడంతో కథ మలుపు తిరుగుతుంది. అసలు సుమతి ఎవరు? ఊరిలోని మూఢనమ్మకాలు, కఠినమైన సంప్రదాయాలు వీరి ప్రేమకు ఎలా అడ్డుగా నిలిచాయి? తన ప్రేమను గెలిపించుకోవడానికి కృష్ణ ఏం చేశాడు? చివరకు సుమతి మనసును ఎలా గెలుచుకున్నాడు? అనేదే మిగతా కథ.
ప్లస్ పాయింట్లు:
ఈ చిత్రంలో ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా వర్క్ అయింది. ప్రేమించిన అమ్మాయి గురించి నిజం తెలిసిన తర్వాత కృష్ణ ఎదుర్కొనే భావోద్వేగాలు బాగానే చూపించారు. ఊరి సంప్రదాయాలు, ఆచారాలు, హీరో మానసిక సంఘర్షణను కలిపిన తీరు కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది.
కామెడీ సన్నివేశాలు పర్వాలేదు. లవ్ అండ్ కామెడీ ఎలిమెంట్స్‌తో వచ్చే సన్నివేశాలు ఎంటర్టైన్ చేస్తాయి. అమర్దీప్ చౌదరి కృష్ణ పాత్రలో సంతృప్తికరంగా నటించాడు. హీరోయిన్ శాయిలీ చౌదరి నటనతో పాటు గ్లామర్‌తో కూడా ఆకట్టుకుంది.
జేడీవీ ప్రసాద్, టేస్టీ తేజ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా తమ పరిధిలో బాగానే నటించారు.
మైనస్ పాయింట్లు:
‘సుమతీ శతకం’ సినిమా ప్రధాన లోపం స్లో స్క్రీన్‌ప్లే. కథలో కాన్ఫ్లిక్ట్ బలంగా లేకపోవడం, ప్రధాన పాత్రలు ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాకపోవడం సినిమాకు మైనస్ అయ్యాయి. హీరో పాత్ర ప్రయాణం కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపదు.
సెకండ్ హాఫ్‌లో అనవసరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో కథ మరింత నెమ్మదిగా సాగుతుంది. సినిమాకి తక్కువ నిడివి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. చాలా సన్నివేశాలు రెగ్యులర్‌గా, ఊహించగలిగేలా ఉంటాయి.
సాంకేతిక విభాగం:
సినిమాలో భావోద్వేగ కంటెంట్ ఉన్నప్పటికీ కథనం ఆసక్తికరంగా సాగలేదు. సుభాష్ ఆనంద్ అందించిన సంగీతం సాదాసీదాగా ఉంది. హలేష్ ఎస్ సినిమాటోగ్రఫీ బాగుంది; న్యాచురల్ లొకేషన్లు అందంగా చూపించారు. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది.
నిర్మాత కొమ్మలపాటి సాయి సుధాకర్ పాటించిన నిర్మాణ విలువలు ప్రశంసనీయం.
తీర్పు:
మొత్తంగా ‘సుమతీ శతకం’ లవ్ అండ్ కామెడీ డ్రామాలో కొన్ని కామెడీ సీన్స్, ఇంటర్వెల్ భాగం బాగా వర్క్ అయ్యాయి. అయితే స్లో కథనం, సెకండ్ హాఫ్‌లో ఆసక్తికరమైన అంశాలు లేకపోవడం సినిమాను వెనక్కి లాగాయి. మొత్తంగా కొన్ని లవ్, ఫన్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.
రేటింగ్: 2.5/5








.png&w=3840&q=75)


కామెంట్స్ (1)
సుమతీ శతకం మూవీ రివ్యూ