

చిత్రం: శంబాల
తారాగణం: ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్, శ్వాసిక విజయ్, మధునందన్, రవి వర్మ, మీసాల లక్ష్మన్, హర్ష వర్ధన్, ఇంద్రనీల్, శైలజ ప్రియ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
నిర్మాతలు: మహీధర్ రెడ్డి, రాజశేఖర్
దర్శకత్వం: యుగంధర్ ముని
విడుదల: 25 డిసెంబర్ 2025
ఆది సాయికుమార్ నుంచి ప్రేక్షకుల దృష్టిని గట్టిగా ఆకర్షించే సినిమా వచ్చి చాలా కాలమే అయ్యింది. ట్రైలర్‌తో ఆసక్తి పెంచిన “శంబాల” శాస్త్రం–ఆధ్యాత్మికతల మధ్య సాగే సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌గా వచ్చింది. టైటిల్, ట్రీట్మెంట్ చూస్తే ప్రస్తుత ట్రెండ్‌కు దగ్గరగా ఉండే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. కథలో విషయం ఎంతవరకు పని చేసిందో చూద్దాం.
1980లో శంబాల అనే మారుమూల గ్రామంలో ఒక ఉల్క పడటంతో ఊరిలో అరిష్టాలు మొదలవుతాయి. కొందరు వింతగా ప్రవర్తిస్తారు. ఒక ఆవు పొదుగుని పిండితే పాలకు బదులు రక్తం రావడం ఊరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఆ ఆవును సజీవసమాధి చేయాలని స్వామీజీ చెప్పినా, కేంద్ర ప్రభుత్వ శాస్త్రవేత్త విక్రం (ఆది) అక్కడికి వచ్చి ప్రతిదీ సైంటిఫిక్‌గా ప్రశ్నిస్తాడు. ఆవును చంపకుండా అడ్డుకుంటాడు. అక్కడినుంచి మరిన్ని మరణాలు జరుగుతాయి. ఉల్కకు, ఈ సంఘటనలకు సంబంధమేంటి? సైన్స్ గెలుస్తుందా? ఆధ్యాత్మికత పైచేయి సాధిస్తుందా? అన్నదే మిగతా కథ.
పురాణ ఛాయలున్న కథకు హారర్, డివైన్ ఎలిమెంట్స్ జోడించి నడిపిన విధానం ఆసక్తికరంగా ఉంది. హీరోయిన్ను కేవలం డ్యూయెట్స్కే పరిమితం చేయకుండా కథలో భాగం చేయడం ప్లస్ పాయింట్. అయితే ఉల్కను పరీక్షించడానికి ఒకే ఒక్క శాస్త్రవేత్త రావడం, అవసరంలేని యాక్షన్ బ్లాక్స్ లాంటి సినిమాటిక్ లిబర్టీలు కొంత అసహజంగా అనిపిస్తాయి.
దేవి పాత్ర లుక్, మేకప్ చూస్తేనే క్లైమాక్స్ దిశగా ఊహ వచ్చేలా ఉండటం మైనస్. ఎక్కువ సినిమాలు చూసిన ప్రేక్షకులకు ట్విస్ట్ ముందే అర్థమయ్యేలా ఉంటుంది. సినిమా మొత్తం ఒకే లొకేషన్లో సాగినా, బోర్ కాకుండా గ్రిప్పింగ్‌గా నడిపేందుకు దర్శకుడు ప్రయత్నించాడు.
“మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు” అనే కాన్సెప్ట్‌ను కథలో కలపడం బాగుంది. “మనం గెలవాల్సింది మనల్ని… భూతాన్ని కాదు” అనే థీమ్, చివర్లో గంటల సింబాలిజం ఆలోచింపజేస్తాయి.
రాములు పాత్రలో రవి వర్మ మంచి ఇంపాక్ట్ ఇస్తాడు. ఆది పాత్రలో కొంత మెథడ్ యాక్టింగ్ కనిపించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మారే దశలో ఇంకా బలమైన ఎమోషన్ అవసరమైంది. దేవి పాత్రలో అర్చనా అయ్యర్ నిండుగా కనిపిస్తుంది. బాలనటి నటన ప్రశంసనీయం. మీసాల లక్ష్మన్, శ్వాసిక విజయ్, మధునందన్లకు మంచి స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయి.
నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్ హారర్ ఫీల్‌ను పెంచాయి. అయితే నిర్మాణ విలువలు సగటు స్థాయిలోనే ఉన్నాయి. ఏఐ, విజువల్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో మైథాలజీ సీన్స్ మరింత ఎఫెక్టివ్‌గా ఉండాల్సింది. విజువల్స్ అనుభూతిపరంగా ఇంకాస్త బలంగా ఉంటే సినిమా స్థాయి పెరిగేది.
శాస్త్రం–మూఢనమ్మకాల మధ్య సాగే సూపర్‌నేచురల్ కథగా “శంబాల” ఆసక్తిని నిలబెట్టే ప్రయత్నం చేసింది. కొన్ని సీన్లు ఫోర్స్డ్గా, కొన్ని బలహీనంగా అనిపిస్తాయి. అద్భుతమైన ట్విస్టులు, సర్ప్రైజులు లేకపోయినా జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులను కూర్చోబెట్టే సామర్థ్యం ఉంది. క్లైమాక్స్ మాత్రం తేలిపోయినట్టు అనిపిస్తుంది. సీక్వెల్‌కు స్కోప్ వదిలిన ఎండింగ్ రొటీన్‌గా అనిపిస్తుంది.
బాటమ్ లైన్: సైన్సా? శాస్త్రమా? – ఆసక్తికరమైన ఐడియా, సగటు ఎగ్జిక్యూషన్.
రేటింగ్: 2.75 / 5



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!