

ఓటీటీ విడుదల తేదీ: 28 ఆగస్టు 2026
ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
నటీనటులు: నిమిష సజయన్, బరున్ సోబ్తీ, అన్షుమన్ పుష్కర్, రాజేశ్ కుమార్, సునీత రజ్వర్ తదితరులు
దర్శకుడు: అంబికా పండిత్
నిర్మాతలు: సౌరభ్ మల్హోత్రా, మనోజ్ మిత్ర, టీనా దర్వాణి
సంగీత దర్శకుడు: అజయ్ జయంతి
సినిమాటోగ్రాఫర్: సునీల్ రామకృష్ణ బార్కర్
ఎడిటర్: తాన్యా ఛబ్రియా
కథ:
బబితా సింగ్ అలియాస్ బేబి మధ్యప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంటుంది. ఒక రోజు తన స్వగ్రామానికి వచ్చిన ఆమెకు చిన్ననాటి స్నేహితుడు బన్సి సింగ్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలుస్తుంది. తొలుత సాధారణ మరణంగా భావించిన ఈ ఘటన క్రమంగా హత్యగా తేలుతుంది. స్థానిక పోలీసులు, భర్త, కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో బబితానే స్వయంగా కేసును దర్యాప్తు చేస్తుంది. చివరకు ఆమె ఈ హత్య మిస్టరీని ఎలా ఛేదించిందనేదే సినిమా కథ.
ప్లస్ పాయింట్లు:
ఈ సినిమాకు నిమిష సజయన్ నటన ప్రధాన బలంగా నిలుస్తుంది. పాత్రకు తగ్గట్టుగా ఆమె తన హావభావాలు, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంది. పాత్ర కోసం ఆమె బరువు పెరిగిన తీరు కూడా అభినందనీయం. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. బరున్ సోబ్తీ తన పరిమిత స్క్రీన్ టైమ్‌లో మంచి నటనను కనబరిచాడు. అన్షుమన్ పుష్కర్, సునీత రజ్వర్, రాజేశ్ కుమార్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. కేవలం హత్య దర్యాప్తుకే పరిమితం కాకుండా బబితా వ్యక్తిగత జీవితం, బాడీ షేమింగ్, కుటుంబ పరిస్థితులు, సిస్టమ్‌తో ఆమె ఎదుర్కొనే సమస్యలను చూపించిన విధానం కూడా బాగుంది.
మైనస్ పాయింట్లు:
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కొన్ని చోట్ల రొటీన్‌గా అనిపిస్తాయి. ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఎక్కువగా చూసే ప్రేక్షకులకు కథలోని కొన్ని విషయాలు ముందుగానే అర్థమయ్యే అవకాశం ఉంది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని రిపీటెడ్ సీన్స్ కథ వేగాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌ను చాలా సింపుల్‌గా ముగించడం నిరాశ కలిగిస్తుంది. హత్య కేసులో పెద్ద ట్విస్ట్ లేదా బలమైన రివీల్ ఉంటుందని ఆశించే ప్రేక్షకులకు ఈ ముగింపు అంతగా సంతృప్తిని ఇవ్వదు. ఇన్వెస్టిగేషన్‌లో చెప్పుకోదగ్గ ట్విస్టులు లేకపోవడం, సినిమా హిందీ ఆడియోకే పరిమితం కావడం కూడా మైనస్‌లుగా అనిపిస్తాయి.
సాంకేతిక విభాగం:
సునీల్ రామకృష్ణ బార్కర్ సినిమాటోగ్రఫీ, అజయ్ జయంతి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి వాతావరణాన్ని తీసుకొచ్చాయి. కథ, పాత్రలను సహజంగా చూపించేలా స్క్రీన్‌ప్లే సాగుతుంది. అయితే దాదాపు రెండున్నర గంటల రన్‌టైమ్ కొంత ఎక్కువగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా ఉండేది. దర్శకురాలు అంబికా పండిత్ డ్రామాను అతిగా చూపించకుండా రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. మర్డర్ మిస్టరీతో పాటు బబితా వ్యక్తిగత జీవితాన్ని, ఆమె ఎదుర్కొనే బాడీ షేమింగ్, కుటుంబ ఒత్తిడి, భర్త నుంచి ఆశించినంత ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వంటి అంశాలను చక్కగా చూపించారు.
తీర్పు:
మొత్తంగా ‘బబితా సింగ్ రిపోర్టింగ్’ సాలిడ్ ట్విస్టుల కంటే పాత్రలు, నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై ఆధారపడి సాగే క్రైమ్ డ్రామా. నిమిష సజయన్ అద్భుతమైన నటనతో సినిమాను ముందుకు నడిపిస్తుంది. అయితే రొటీన్ ఇన్వెస్టిగేషన్, కొన్ని రిపీటెడ్ సీన్స్, సింపుల్ క్లైమాక్స్ సినిమాకు మైనస్‌గా నిలిచాయి. క్రైమ్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఒకసారి ట్రై చేయవచ్చు.
రేటింగ్: 2.5/5













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!