

సినిమా పేరు: జైలర్ 2 (Jailer 2)
విడుదల తేదీ: అక్టోబర్ 15, 2026
నటీనటులు: రజనీకాంత్, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, రమ్యకృష్ణ, విద్యా బాలన్ తదితరులు
దర్శకుడు: నెల్సన్ దిలీప్‌కుమార్
నిర్మాత: కలానిధి మారన్
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రాఫర్: విజయ్ కార్తిక్ కన్నన్
ఎడిటర్: ఆర్. నిర్మల్
కథ:
రిటైర్డ్ పోలీస్ అధికారి టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) ప్రస్తుతం సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా పనిచేస్తూ కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. మరోవైపు, వర్మను హత్య చేసిన వ్యక్తి కోసం కల్పక్ కుటుంబం (ఎస్.జె. సూర్య కుటుంబం) వెతుకుతుంటుంది. ఈ క్రమంలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ముత్తువేల్ పాండియన్‌ను సమస్యల్లోకి నెట్టేస్తాయి. పురాతన విగ్రహాలకు సంబంధించిన ఘటనల నేపథ్యంలో తన కుటుంబాన్ని కాపాడటంతో పాటు విగ్రహాలను రక్షించేందుకు టైగర్ మళ్లీ రంగంలోకి దిగాల్సి వస్తుంది. అతడి అసలు స్వరూపం తెలిసిన తర్వాత కాంత (విద్యా బాలన్) కుటుంబం ఎలా స్పందించింది? తమ నుంచి పోయిన విగ్రహాలను తిరిగి పొందేందుకు వారు ఏం చేశారు? కల్పక్ కుటుంబాన్ని టైగర్ తన బృందం సహాయంతో ఎలా ఎదుర్కొన్నాడు? చివర్లో కాంత అతడికి ఎలాంటి సవాల్ విసిరింది? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్లు:
టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ తనదైన స్టైల్, బాడీ లాంగ్వేజ్, పవర్ఫుల్ యాక్షన్‌తో ఆకట్టుకున్నారు. యాక్షన్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన నటనతో మెప్పించారు. ముఖ్యంగా తన కొడుకు విషయంలో తాను చేసిన పనులు కుటుంబానికి తెలిసే సందర్భంలో రజనీ నటన బాగుంది. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు, స్టైలిష్ లుక్స్ అభిమానులకు నచ్చేలా ఉన్నాయి. అతిథి పాత్రల్లో కనిపించిన హృతిక్ రోషన్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు. చివర్లో విజయ్ సేతుపతి ఎంట్రీ ఆకట్టుకుంటుంది. ఎస్.జె. సూర్య తన పాత్రలో మెప్పించగా, రమ్యకృష్ణ తల్లి పాత్రకు న్యాయం చేశారు. పూర్ణ స్పెషల్ సాంగ్, యోగిబాబు కామెడీ కూడా అలరిస్తాయి. దర్శకుడు నెల్సన్ రూపొందించిన ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయి. మూడో భాగంపై ఆసక్తిని పెంచేలా ఇచ్చిన హింట్ కూడా బాగుంది.
మైనస్ పాయింట్లు:
రజనీకాంత్ పాత్రను, యాక్షన్ సన్నివేశాలను బలంగా తీర్చిదిద్దిన దర్శకుడు కథనాన్ని మాత్రం అదే స్థాయిలో నడిపించలేకపోయారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. ప్రథమార్థాన్ని వేగంగా నడిపించిన నెల్సన్, సెకండాఫ్‌లో కొన్ని చోట్ల కథనంపై మరింత శ్రద్ధ పెట్టాల్సింది. కుటుంబ భావోద్వేగాలు కొంతమంది ప్రేక్షకులకు కనెక్ట్ అయినప్పటికీ, మాస్ ప్రేక్షకులకు అవి పూర్తిస్థాయిలో నచ్చకపోవచ్చు. కథలో బలమైన భావోద్వేగాలు, సంఘర్షణ ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో వాటిని ప్రేక్షకులు పూర్తిగా అనుభూతి చెందేలా సన్నివేశాలను తీర్చిదిద్దలేదు. భారీ ఎలివేషన్లు, అతిథి పాత్రలు ఆకట్టుకున్నా, కథనం కొన్ని చోట్ల సాధారణంగా సాగుతుంది. కొన్ని సన్నివేశాల్లో కొత్తదనం లోపించడం కూడా సినిమాకు ప్రతికూలంగా మారింది.
సాంకేతిక విభాగం:
దర్శకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ తన మార్క్‌ను చూపించినప్పటికీ, రచయితగా కథనం, సన్నివేశాల రూపకల్పనపై మరింత దృష్టి పెట్టాల్సింది. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం, కీలక సన్నివేశాలకు బలాన్నిచ్చాయి. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి సన్నివేశాన్ని తెరపై అందంగా చూపించడంలో ఆయన పనితనం కనిపిస్తుంది. ఆర్. నిర్మల్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ, ద్వితీయార్థంలోని కొన్ని సాగదీసిన సన్నివేశాలను కుదించి ఉంటే సినిమా మరింత వేగంగా సాగేది. కలానిధి మారన్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
తీర్పు:
భారీ తారాగణంతో రూపొందిన జైలర్ 2లో రజనీకాంత్ స్టైల్, నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, అతిథి పాత్రలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. అయితే, కొన్ని చోట్ల సాధారణంగా సాగే కథనం, నెమ్మదైన సన్నివేశాలు సినిమాపై ప్రభావం చూపుతాయి. మొత్తంగా రజనీకాంత్ అభిమానులతో పాటు యాక్షన్, ఎమోషన్ కలగలిపిన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు జైలర్ 2 నచ్చే అవకాశముంది.
రేటింగ్: 2.5/5




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!