

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం బడ్జెట్పై వస్తున్న విమర్శలకు నటుడు యశ్ స్పందించారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 15న బెంగళూరులో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మాట్లాడిన యశ్.. అంతర్జాతీయ ప్రేక్షకులకు భారతీయ సినిమా నిర్మాణ స్థాయిని పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే బడ్జెట్ వివరాలను వెల్లడిస్తున్నామని తెలిపారు.
విదేశాల్లో సినిమాను ప్రమోట్ చేసేటప్పుడు దాని నిర్మాణ స్థాయి, పెట్టుబడి గురించి ఆత్మవిశ్వాసంతో చెప్పాలని యశ్ అభిప్రాయపడ్డారు. తక్కువ బడ్జెట్ చిత్రంగా పరిచయం చేస్తే అంతర్జాతీయ ప్రేక్షకులు దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని పేర్కొన్నారు. ‘రామాయణ’ను కేవలం భారీ బడ్జెట్ సినిమాగా కాకుండా, భారతీయ చిత్ర పరిశ్రమ సాంకేతిక సామర్థ్యం, సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పే అవకాశంగా చూడాలని అన్నారు. ఈ చిత్రంలో రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో మొదటి భాగం దీపావళికి విడుదల కానున్నట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!