

టాలీవుడ్లో అభిమానులను ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంట తమ తాజా చిత్రం ‘రణబాలి’ విడుదలకు ముందు ఆధ్యాత్మిక యాత్ర చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ ప్రమోషన్ల వేళ.. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీరిద్దరూ తాజాగా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. అక్కడ ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి వేడుకలు, వార్షిక వేద పురుష సప్తహ జ్ఞాన యజ్ఞంలో భాగంగా సాయి కుల్వంత్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండకు పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విద్యాసంస్థలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన.. తన ప్రతిష్ఠాత్మక చిత్రం విడుదలకు ముందు పుట్టపర్తిని సందర్శించి సాయిబాబా ఆశీస్సులు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ‘రణబాలి’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రిటిష్ పాలన సమయంలో రాయలసీమలో నెలకొన్న తీవ్ర కరువు, ఆకలితో అలమటించిన ప్రజల విషాద చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చారిత్రక నేపథ్యం, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి ఆదరణ పొందుతుందో ఆసక్తికరంగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!