
.jpg&w=3840&q=75)
ఏ పనినైనా సాధించాలనే గొంతు మనసులో ఉంటే, పెద్ద శిక్షణ కావాలన్న నియమనిబంధనలు అడ్డుకావు. అస్సాంలోని ఒక చిన్న గ్రామంలో పెరిగిన రిమా దాస్ కథ అదే చెప్పుతుంది. ఆమె ఫిల్మ్ స్కూల్ చదువు లేదు. ఎవరైనా ప్రముఖ దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అనుభవం కూడా లేదు. అయినా ఒక చిన్న హ్యాండ్ కెమెరాతో సినిమా తీసి, ఆ చిత్రం భారతదేశ తరఫున ఆస్కార్ ఎంట్రీ వరకు వెళ్లింది.
సాధారణ కుటుంబంలో పుట్టిన రిమా దాస్‌కు దర్శకత్వం అనే ఆలోచన ప్రారంభంలో అసలు లేదు. ఆమె తండ్రి టీచర్, తల్లి ప్రింటింగ్ ప్రెస్ మరియు పుస్తకాల దుకాణం నిర్వహించేవారు. చిన్నప్పటి నుంచి ప్రకృతి, సంగీతం అంటే ఇష్టం. అందుకే నృత్యం, నటన పై ఆసక్తి పెరిగింది. తల్లిదండ్రులు ఆమెను ప్రొఫెసర్‌గా చూడాలని భావించినా, కాలేజీ రోజులలో చేసిన స్టేజ్ ప్రదర్శనలు ఆమె కళా ప్రయాణానికి ఆరంభం అయ్యాయి.
సినిమాలు చూస్తూ మేకింగ్ నేర్చుకున్న రిమాకు, నటన కంటే దర్శకత్వం మీదే ఎక్కువ ఆకర్షణ పెరిగింది. ఇతరుల్లా పెద్ద గురువుల దగ్గర శిక్షణ తీసుకోవాలనే తపన లేకుండా, తన దగ్గర ఉన్న చిన్న కెమెరాతోనే ప్రయోగాలు మొదలుపెట్టింది. అదనపు లైటింగ్ పరికరాలు లేకుండానే, సహజమైన సూర్యకాంతినే ఆధారంగా చేసుకుని సినిమా తీశింది. ఆ సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’. ఇదే అస్సాం నుంచి ఆస్కార్ ఎంట్రీ పొందిన తొలి చిత్రం.
పంజాబ్ దర్శకుడు పంజాబ్ కథ చెప్తాడు, గుజరాత్ దర్శకుడు గుజరాత్ కథ చెప్తాడు. మరి నేను అస్సాం కథ ఎందుకు చెప్పకూడదు? ఇది ఆమె దృష్టికోణం. ఇతరుల గురించి ఫిర్యాదు చేయకుండా, తానే తన స్పేస్‌ను సృష్టించుకుని, అస్సాం జీవితాన్ని ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం సహాయం చేస్తుందా? చేయదా? అన్న ఆశలు పెట్టుకోకుండా, సినిమాలు తీయడం తన బాధ్యతగా భావించి ముందడుగు వేసింది.
ఆ నిర్ణయం ఆమెకు ఫలిచింది. సినిమా విజయంతో పాటు, నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది. అయినా రిమా దాస్ ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. ఆమెకు ఇంకా సినిమాల పై ఆకలి తగ్గలేదు. కెరీర్ ప్రారంభంలో ఉన్న తపనే ఆమెను కొత్త కోణాల్లో కథలు చెప్పడానికి ప్రేరేపిస్తోంది. తన సినిమాలు ప్రజల్లో ఏ మార్పు తీసుకువస్తాయి? సమాజం ఎలా గ్రహిస్తుంది? ఇవే ప్రశ్నలు ఆమెను ముందుకు నడిపిస్తున్నాయి.
ఒకప్పుడు గ్రామ వీధుల్లో ఆడుకున్న అమ్మాయి, ఈరోజు భారతీయ సినిమా చరిత్రలో చెరగని గుర్తు వేసే స్థాయికి ఎదిగిందంటే, ఆమె సంకల్పం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!