

ముంబై పోలీసులు జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ నటుడు ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనలో పాల్గొన్న నేపథ్యంలో, అక్టోబర్ 28, 2026లోగా భారత్ను విడిచి వెళ్లాలని పోలీసులు ఆయనకు నోటీసు జారీ చేసినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. పీటీఐ కథనం ప్రకారం, ఆయన తరఫు న్యాయవాది జుల్ఫికర్ మెమన్ శుక్రవారం లేదా సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
తన వద్ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డు ఉందని, నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకునే నిబంధన భారత చట్టాల్లో లేదని ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు పిటిషన్లో వాదించనున్నట్లు సమాచారం. దేశం విడిచి వెళ్లాలని ఆదేశించడం అత్యంత కఠినమైన చర్య అని వారు పేర్కొననున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 10న ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్లో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ జరిగిన నిరసనలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆ సమయంలో పోలీసులు ఆయనను కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఫిర్యాదుల నేపథ్యంలో నోటీసు జారీ చేసినట్లు కథనాలు చెబుతున్నాయి. ఈ పిటిషన్పై బాంబే హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!