

‘అమరన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ప్రస్తుతం ‘ఓం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 20న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘అమరన్’ షూటింగ్ సమయంలో ధనుష్‌ను కలిసే అవకాశం లభించిందని, అప్పట్లో ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ కోసం మంచి కథల కోసం చూస్తూ తనను కూడా కథలు సిద్ధం చేయాలని అడిగారని దర్శకుడు తెలిపారు.
‘ఓం’ సినిమాకు ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని, తనకు పూర్తి సృజనాత్మక స్వేచ్ఛను ఇచ్చారని రాజ్‌కుమార్ పెరియసామి ప్రశంసించారు. గత ఏడాది మార్చిలో మమ్ముట్టిని కలిసి కథా సారాంశాన్ని వివరించగా, కేవలం 15–20 నిమిషాల్లోనే ఆయన సినిమాకు అంగీకారం తెలిపారని వెల్లడించారు. ఆ తర్వాత పూర్తి కథ విన్న మమ్ముట్టి ఎంతో ఆకట్టుకున్నారని చెప్పారు. ‘ఓం’ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాని సార్వత్రిక స్నేహ కథ అని, క్రైమ్ నేపథ్యంలో సాగే భావోద్వేగభరితమైన డ్రామా అని దర్శకుడు వివరించారు. ఇందులో ప్రధాన నటీనటులందరూ గతంలో పోషించని విభిన్నమైన గ్రే షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని తెలిపారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా స్ఫూర్తి పొందినప్పటికీ, సినిమా పూర్తిగా కల్పిత ప్రపంచంలో సాగుతుందని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!