

రాజకీయ రంగ ప్రవేశానికి ముందు హీరో విజయ్ చివరి సినిమాగా చెప్పుకున్న ‘జన నాయకుడు’ జనవరి 9 న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మలేసియాలో డిసెంబర్ 27 న జరగనున్న ఆడియో లాంచ్ ఈవెంట్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవ్వగా, ఈ ఒక్క ఈవెంట్ ద్వారానే యాభై కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని సమాచారం. తమిళనాడు నుండి అభిమానులు పెద్ద ఎత్తున ఈవెంట్ కోసం మలేసియాకు వెళ్తున్నారు. అనిరుధ్ రవిచందర్ అందించబోయే మ్యూజికల్ కన్సర్ట్ అద్భుతంగా ఉండబోతుందని ఇప్పటికే టాక్ ఉంది.
అయితే, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు అభిమానుల్లో టెన్షన్ పెంచుతున్నాయి. దర్శకుడు హెచ్. వినోత్ మరియు నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ మధ్య సినిమా ఫైనల్ అవుట్పుట్ పై కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయని, అందుకే కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రమోషన్ల వేగం తగ్గడం, కొత్త అప్డేట్స్ లేకపోవడం అభిమానుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
ఇంతవరకు టీమ్ ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. జన నాయకుడు లిరికల్ సాంగ్ తమిళంలో విడుదలైనా, తెలుగులో ఇప్పటికీ రాలేదు. డిస్ట్రిబ్యూషన్ హక్కులు నాగ వంశీ సొంతం చేసుకున్నారని టాక్ ఉన్నా, ఆయన వైపు నుంచి ధృవీకరణ రాలేదు. ప్రస్తుతం ఆయన సంక్రాంతి రిలీజ్ మూవీ ‘అనగనగా ఒక రాజు’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికి ఉన్న సమాచారమైతే జన నాయకుడు మన రాజా సాబ్ తో పాటు జనవరి 9 నే రానుంది. ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే ప్రభాస్ మూవీకి మరింత అడ్వాంటేజ్ అవుతుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!