

ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జోహో ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వెల్లడించారు. కృత్రిమ మేధ (AI) సంబంధిత వ్యయాలు భారీగా పెరగడం, మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉద్యోగుల వేతనాల పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మార్కెటింగ్‌తో పాటు ఇతర విభాగాల బడ్జెట్లను కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేస్తూనే, ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థను నిలబెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని వివరించారు.
సాఫ్ట్వేర్ రంగంలో నెలకొన్న సవాళ్ల నేపథ్యంలో మూకుమ్మడి ఉద్యోగుల తొలగింపులను నివారించేందుకు ప్రయత్నిస్తున్నామని శ్రీధర్ వెంబు తెలిపారు. గత 18 నెలలుగా సంస్థలో ఉద్యోగుల సంఖ్యను పెంచలేదని వెల్లడించారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటున్న ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం జోహో కొత్త మార్గాలను అన్వేషిస్తోందని, ఆ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో స్పష్టమవుతుందని పేర్కొన్నారు. ఈ వివరాలను ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టు ద్వారా వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!