

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్, యూజర్ల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటివరకు హోమ్‌పేజీలో కనిపించే పాత టాపిక్ చిప్స్ స్థానంలో ‘కస్టమ్ ఫీడ్స్’ (Custom Feeds) ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. దీనితో పాటు మొబైల్ యాప్ నావిగేషన్‌లోనూ కొన్ని మార్పులు చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన అంశాలు, కంటెంట్ రకాలు, ఆసక్తులకు అనుగుణంగా ప్రత్యేకమైన వీడియో ఫీడ్లను రూపొందించుకోవచ్చు. ఇందుకోసం హోమ్‌పేజీ పైన ఉన్న ‘+’ బటన్‌ను ట్యాప్ చేసి, తమకు కావాల్సిన టాపిక్ లేదా కంటెంట్ గురించి టైప్ చేయాలి. ఆ వివరాల ఆధారంగా యూట్యూబ్ ప్రత్యేకమైన వీడియో స్ట్రీమ్‌ను రూపొందిస్తుంది.
కొత్త వీడియోలు అప్లోడ్ అయినప్పుడు ఈ కస్టమ్ ఫీడ్స్ ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతాయి. ఉచితంగా యూట్యూబ్ ఉపయోగించే వారు ఒకేసారి గరిష్టంగా మూడు ఫీడ్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రైబర్లు ఎనిమిది ఫీడ్స్ వరకు సేవ్ చేసుకునే అవకాశం ఉంది. యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ ఎక్స్ వేదికగా ఈ ఫీచర్ వివరాలను వెల్లడిస్తూ, హోమ్‌పేజీపై యూజర్లకు మరింత నియంత్రణ లభిస్తుందని తెలిపారు. మరోవైపు, మొబైల్ యాప్‌లోని హోమ్ ట్యాబ్‌లో కొత్త టాప్ నావిగేషన్ బార్‌ను కూడా యూట్యూబ్ పరీక్షిస్తోంది. ఇందులో సబ్స్క్రిప్షన్స్ ఫీడ్‌తో పాటు లైవ్, మ్యూజిక్ షార్ట్‌కట్స్ ఉంటాయి. అర్హులైన సబ్స్క్రైబర్లకు ‘మూవీస్ అండ్ టీవీ’ ఆప్షన్ కూడా కనిపించనుంది.
ప్రస్తుతం ఈ అప్డేట్ అమెరికాలో 13 ఏళ్లు పైబడిన, ఇంగ్లీష్ భాషను ఎంచుకున్న యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. ఈ ఫీచర్ పనిచేయాలంటే యూజర్ల వాచ్ హిస్టరీ, సెర్చ్ హిస్టరీ ఆన్‌లో ఉండాలి. మొబైల్ యాప్‌లో రూపొందించిన కస్టమ్ ఫీడ్స్ డెస్క్‌టాప్ బ్రౌజర్తోనూ సింక్ అవుతాయి. దీంతో వివిధ పరికరాల్లో తమకు నచ్చిన వీడియోలను సులభంగా వీక్షించవచ్చు. త్వరలో ఈ అప్డేట్ను మరింత మంది యూజర్లకు విస్తరించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!