

ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్ అక్టోబర్ 28న కొత్త ఉత్పత్తులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ లాంచ్‌లో అప్‌డేట్ చేసిన మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లు, కొత్త ఐమ్యాక్, ఐప్యాడ్ మినీ అందుబాటులోకి రావచ్చని టెక్ నివేదికలు చెబుతున్నాయి. వీటిలో ప్రధాన ఆకర్షణగా OLED టచ్‌స్క్రీన్‌తో కూడిన హైఎండ్ మ్యాక్‌బుక్ ప్రో నిలవనుందని అంచనా. ప్రస్తుత ప్రీమియం మోడళ్లలోని మినీ-ఎల్‌ఈడీ డిస్‌ప్లేలతో పోలిస్తే కొత్త స్క్రీన్ మెరుగైన కాంట్రాస్ట్, స్పష్టమైన రంగులు, గాఢమైన నలుపు రంగును అందించే అవకాశం ఉంది. టచ్‌స్క్రీన్‌తో పాటు సంప్రదాయ కీబోర్డ్, ట్రాక్‌ప్యాడ్ కూడా కొనసాగవచ్చని తెలుస్తోంది. డిస్‌ప్లే నాచ్ స్థానంలో ఐఫోన్ తరహా డైనమిక్ ఐలాండ్ ఇంటర్‌ఫేస్, తక్కువ బరువుతో కూడిన అంతర్గత నిర్మాణం, బలమైన హింజ్ వంటి మార్పులు కూడా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వివరాలను యాపిల్ అధికారికంగా ధ్రువీకరించలేదు.
మరోవైపు, M6 చిప్‌తో 14 అంగుళాల ఎంట్రీ లెవల్ మ్యాక్‌బుక్ ప్రో, అప్‌డేట్ చేసిన ఐమ్యాక్‌ను కూడా యాపిల్ పరిచయం చేయవచ్చని సమాచారం. OLED డిస్‌ప్లేతో వచ్చే హైఎండ్ మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లలో M5 Pro, M5 Max చిప్‌లనే కొనసాగించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. కొత్త ఐప్యాడ్ మినీలో OLED స్క్రీన్‌తో పాటు A20 Pro ప్రాసెసర్, సన్నని బెజెల్స్, Wi-Fi 7 సపోర్ట్, మెరుగైన కెమెరా, స్పీకర్లు, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉండవచ్చని అంచనా. ఈ పరికరాల విక్రయాలు నవంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ధరలు, ఫీచర్లు, విడుదల తేదీలపై యాపిల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!