

గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో నకిలీ హాజరు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్‌ను కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ధ్రువీకరణ విధానంతో అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో ముఖ నిర్ధారణ విధానాన్ని ప్రవేశపెట్టినా, నకిలీ హాజరు నమోదు పూర్తిగా ఆగలేదని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. కొన్ని సందర్భాల్లో కూలీల అసలు ముఖాన్ని నిర్ధారించకుండా, వారి ఫొటోలను కెమెరాతో చిత్రీకరించి హాజరు నమోదు చేసినట్లు సమాచారం. కొత్త ఏఐ విధానంలో కెమెరా ముందు నిజమైన వ్యక్తి ఉన్నప్పుడే హాజరు నమోదయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. నకిలీ హాజరు లేదా ఇతర అవకతవకలు గుర్తిస్తే, సమస్య పరిష్కారమయ్యే వరకు సంబంధిత నిధుల బదిలీ ఆదేశం (ఎఫ్‌టీవో) ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది. మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని పని ప్రదేశాల్లో ఆఫ్‌లైన్ విధానంలో హాజరు నమోదు కొనసాగుతుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, సాంకేతిక సమస్యలు ఎదురైన సందర్భాలకు మినహాయింపులు ఉంటాయని మంత్రి తెలిపారు.
మరోవైపు, డిజిటల్ వ్యవసాయ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించిందని శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కార్డులు (ఫార్మర్ ఐడీలు) అందించే లక్ష్యాన్ని నిర్ణీత గడువు కంటే ఐదు నెలల ముందే పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ లక్ష్యాన్ని 2027 మార్చి 31 నాటికి సాధించాలని కేంద్రం నిర్ణయించగా, అంతకంటే ముందుగానే పూర్తి చేసినట్లు వెల్లడించారు. రైతులకు సంబంధించిన సేవలను మరింత సమర్థంగా అందించడం, ప్రభుత్వ పథకాల అమలును సులభతరం చేయడం వంటి లక్ష్యాలతో ఈ డిజిటల్ గుర్తింపు విధానాన్ని తీసుకొచ్చారు. గ్రామీణ ఉపాధి పథకంలో పారదర్శకతను పెంచడంతోపాటు వ్యవసాయ రంగంలో డిజిటల్ సేవలను విస్తరించేందుకు కేంద్రం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు ఈ ప్రకటనలు సూచిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!