

సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వయసుతో సంబంధం లేకుండా కొత్త ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావచ్చని 13 ఏళ్ల చైనా విద్యార్థిని జు షుహాన్ నిరూపించింది. కోడింగ్‌పై ప్రత్యేక పరిజ్ఞానం లేకపోయినా AI సాయంతో ‘జై చాంగ్’ పేరుతో స్టడీ అసిస్టెంట్ యాప్‌ను రూపొందించింది. ఉద్యోగాల్లో బిజీగా ఉండే తల్లిదండ్రులు పిల్లల చదువును దూరం నుంచే పర్యవేక్షించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.
యాప్‌లో తల్లిదండ్రుల ఫొటోను అప్‌లోడ్ చేస్తే అది వర్చువల్ రూపంలో మారి పిల్లల చదువు తీరును పర్యవేక్షిస్తుంది. విద్యార్థి మొబైల్ ఫోన్ ఉపయోగించినా, చదువును వదిలి వెళ్లినా కెమెరా ద్వారా గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తుంది. స్టడీ షెడ్యూల్ రూపొందించడం, క్లిష్టమైన నోట్స్‌ను సులభంగా మార్చడం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. హాంగ్‌జౌలో జరిగిన జాతీయ స్థాయి AI ప్రొడక్ట్ మార్కెటింగ్ పోటీలో మూడు రోజుల్లో యాప్ విక్రయాల ద్వారా 18,000 యువాన్లు, అంటే సుమారు రూ.2.5 లక్షలు సంపాదించిన ఆమె, అదనంగా 5,000 యువాన్ల మూడో బహుమతిని కూడా గెలుచుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!