

భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు ముల్లాన్‌పూర్, న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ స్టేడియంలో మొదటిసారి పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ జరగడం విశేషం. కటక్‌లో జరిగిన తొలి టీ20లో 101 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్ ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.
భారత్ జోరులోనే – పాండ్యా రీ ఎంట్రీతో జట్టుకు బలమే!
భారత్ మంచి మొమెంటమ్ తో రెండో మ్యాచ్‌లోకి అడుగుపెడుతోంది. గాయానికి గురై చాలా కాలం దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా తిరిగి రావడం జట్టుకు పెద్ద బలం అయింది. మొదటి టీ20 లో 59 పరుగులు చేసి, కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా జట్టులోకి చేరడంతో టాప్ ఆర్డర్ మరింత బలోపేతమైంది. కటక్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. అర్షదీప్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికాను కేవలం 74 పరుగులకు ఆల్ అవుట్ చేశారు. ఇది వారి టీ20 చరిత్రలో కనిష్ఠ స్కోరు.
ముల్లాన్‌పూర్ పిచ్ మిస్టరీ – ఎవరికీ అనుకూలం?
ముల్లాన్‌పూర్‌లోని కొత్త PCA స్టేడియం IPL మ్యాచ్‌లను మాత్రమే చూసింది. అంతర్జాతీయ మ్యాచ్ ఇక్కడ మొదటిసారి జరగబోతుంది. కాబట్టి పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో అనేది ఇద్దరు జట్లకూ మిస్టరీగానే ఉంది. IPLలో ఇక్కడ కొన్నిసార్లు భారీ స్కోర్లు, మరికొన్ని సార్లు తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. అదే సమయంలో ఈ గ్రౌండ్లో డ్యూ ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున రెండో బ్యాటింగ్ చేసే జట్టుకే ఎక్కువ ప్రయోజనం ఉండొచ్చు. చివరి ఓవర్లలో బౌలర్లకు బంతిని పట్టుకోవడమే సవాలవుతుంది.
వాతావరణం ఎలా ఉంది?
ముల్లాన్‌పూర్‌లో వాతావరణం కొంచెం మబ్బుగా, పొగమంచుతో ఉండొచ్చు. ఉష్ణోగ్రత మధ్యాహ్నం 19°C నుండి 23°C మధ్య ఉండి, రాత్రికి 9°C వరకు పడిపోవచ్చు. గాలి నాణ్యత (ఎయిర్ క్వాలిటీ) కూడా అంతగా బాగుండదు. అయినా పిచ్ మంచి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. భారత్ ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని చూస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌గా తీసుకుంటోంది.
భారత్ టీ20 జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా
సౌతాఫ్రికా టీ20 జట్టు: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రం (కెప్టెన్), టోనీ డి జోర్జీ, డేవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, కేశవ్ మహరాజ్, ఆండ్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, రీజా హెండ్రిక్స్, ఓట్లీల్ బార్ట్‌మన్, డోనోవన్ ఫెర, క్వెనా మాఫాఖా, జార్జ్ లిండే










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!