

టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ నవంబర్ 25న అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7న కొలంబోలో నెదర్లాండ్స్–పాకిస్తాన్ మధ్య ప్రారంభ మ్యాచ్‌తో టోర్నమెంట్‌కు తెరలేవనుంది. అదే రోజు సాయంత్రం 7 గంటలకు భారత జట్టు అమెరికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత భారత్ ఫిబ్రవరి 12న నమీబియాతో, 15న పాకిస్థాన్‌తో, 18న నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు ముందు ట్రోఫీ టూర్‌ను చారిత్రాత్మకంగా ప్రారంభించారు. రామసేతు (ఆడమ్స్ బ్రిడ్జ్) మీదగా రెండు సీట్ల పారామోటార్ ద్వారా ట్రోఫీని గాల్లోకి తీసుకెళ్లడం విశేష ఆకర్షణగా నిలిచింది. భారత్–శ్రీలంక మధ్య ఉన్న ఈ ప్రాంతం మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు రెండు ఆతిథ్య దేశాలను కలిపే వారధిగా నిలుస్తోంది.
2026 టీ20 ప్రపంచ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. 29 రోజుల పాటు సాగే ఈ టోర్నమెంట్ భారత్, శ్రీలంకలోని ఎనిమిది వేదికలలో జరగనుంది. రామసేతును ట్రోఫీ టూర్ ప్రారంభానికి ఎంచుకోవడం వెనుక ‘కనెక్ట్ అవ్వడం’ అనే భావన ఉందని ఐసీసీ స్పష్టం చేసింది. క్రికెట్ ద్వారా దేశాలు, సంస్కృతులు, అభిమానులను కలపాలన్నదే ఈ ప్రయాణం లక్ష్యమని పేర్కొంది.
ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్ జై షా మాట్లాడుతూ, రామసేతు వంటి చారిత్రాత్మక ప్రదేశంలో ట్రోఫీ టూర్ ప్రారంభించడం ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఇది కేవలం ట్రోఫీ ప్రయాణం కాదని, ప్రపంచ క్రికెట్ కుటుంబాన్ని ఒక తాటిపైకి తెచ్చే యాత్ర అని అన్నారు.
ట్రోఫీ టూర్లో భాగంగా భారత్, శ్రీలంకతో పాటు ఖతార్, ఒమన్, నేపాల్, బహ్రెయిన్, మంగోలియా వంటి దేశాల్లో ట్రోఫీ సందర్శించనుంది. చిన్న దేశాల్లో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు పాఠశాలలు, కళాశాలలు, క్యాంపస్‌లు, అభిమానుల సమావేశాలు, క్రికెట్ కార్నివల్లు నిర్వహించనున్నారు.
గ్రూప్ దశలో ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్–2లో నిలిచిన జట్లు సూపర్–8కు అర్హత సాధిస్తాయి. సూపర్–8 దశలో మూడు మ్యాచ్‌లు ఉంటాయి. ఫైనల్‌కు చేరాలంటే ఒక్కో జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.
భారతదేశంలో అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా వేదికలుగా ఉండగా, శ్రీలంకలో కొలంబో, కాండీ స్టేడియాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
2007లో ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్‌లో భారత్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు చెరో రెండు టైటిళ్లు గెలుచుకున్నాయి. 2007, 2024లో భారత్ ట్రోఫీని ఎత్తుకోగా, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!